యేసు క్రీస్తు పునరుత్థానము ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పటానికి అనేక కారణాలున్నాయి. మొదటిగా, యేసు క్రీస్తు పునరుత్థానము దేవుని యొక్క అపరిమితమైన శక్తిని తెలియజేస్తుంది. పునరుత్థానమును నమ్మటమంటే, దేవుని నమ్మటమే. దేవుడుండియుంటే, ఈ సృష్టిని ఆయన చేసియుంటే మరియు ఈ సృష్టంతటిపైన ఆయనకు అధికారముంటే, ఖచ్చితముగా ఆయనకు మృతులను లేపే శక్తి ఉంటుంది. ఆయనకు ఆ విధమైన శక్తి లేకుంటే, మన విశ్వాసానికి మన ఆరాధనకు ఆయన యోగ్యుడు కాదు. జీవమును సృజించినవాడు మాత్రమే మరణము తరువాత దానిని తిరిగి బ్రతికించగలడు, ఆయన మాత్రమే అఘోరమైన ఆ మరణమును సైతము ఓడించగలడు, ఆయన మాత్రమే మరణపు ముల్లును తీసివేసి, సమాధిపైన విజయమును పొందగలడు (1కొరింథీ 15:54-55).  యేసు క్రిస్తు ప్రభువును సమాధినుండి తిరిగి లేపుటవలన, జీవ మరణములపైన తనకు సార్వభౌమాధికారము కలదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు.

యేసు క్రీస్తు పునరుత్థానము ఎందుకంత ప్రాముఖ్యమైనది అనగా, తాను దేవుని కుమారుడను మరియు క్రీస్తును (మెస్సీయా) అని తనగురించి తానుగా, యేసు క్రీస్తు ప్రభువు చెప్పుకున్న ఆయన మాటలను అది రూఢిపరుస్తుంది. యేసు క్రీస్తు మాటల ప్రకారం, తన పరిచర్యను ప్రామాణికము చేయుటకు “పరలోకమునుండి వచ్చిన సూచన”గాను (మత్తయి 16:1-4) మరియు యెరూషలేములోని దేవాలయముపైన తనకు అధికారము కలదని రుజువుగాను (యోహాను 2:18-22) ఆయన పునరుత్థానమున్నది. యేసు క్రీస్తు పునరుత్థానమును గూర్చి వందలమంది ప్రత్యక్షసాక్షులు సాక్ష్యము పలికారు (1కొరింథి 15:3-8), మరియు ఆయన పునరుత్థానము “ఆయన లోకరక్షకుడు” అని చెప్పే నిరాక్షేపమైన రుజువుగా ఉన్నది.

యేసు క్రీస్తు పునరుత్థానము ప్రాముఖ్యమైనది అనిచెప్పుటకు మరొక కారణమేమనగా, అది ఆయన పాప రహితమైన జీవితమును మరియు ఆయన దైవిక స్వభావమును రుజువు చేస్తుంది. దేవుని “పరిశుద్ధుడు” కుళ్లు పట్టడు అని  లేఖనములు తెలియజేయుచున్నవి (కీర్తనలు 16:10), మరియు యేసు మరణించిన తరువాత కూడా ఆయన శరీరము కుళ్లిపోలేదు (అపొ.కార్యములు 13:32-37 చూడండి). క్రీస్తు పునరుత్థానము మీదనే అపొస్తలుడైన పౌలు ప్రకటించాడు, “యేసు క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియును గాక” (అపొ.కార్యములు 13:38-39).

యేసు క్రీస్తు పునరుత్థానము ఆయన దైవత్వమును రూఢిపరచుట మాత్రమే కాదు; ఇది యేసు క్రీస్తు శ్రమలు మరియు పునరుత్థానమును గురించి పాత నిబంధనలో ముందుగా చెప్పబడిన ప్రవచనాలను కూడా రూఢిపరుస్తుంది (అపొ.కార్యములు 17:2-3 చూడండి). క్రీస్తు పునరుత్థానము తాను మూడవ దినమున తిరిగి లేస్తాను అని ఆయన తన నోటితో చెప్పిన మాటలను కూడా రూఢిపరుస్తున్నాయి (మార్కు 8:31; 9:31; 10:34). యేసు క్రీస్తు ప్రభువు పునరుత్థానము చెందియుండకపోతే, మనము తిరిగి లేస్తామనే నిరీక్షణే లేదు. వాస్తవానికి, యేసు క్రీస్తు పునరుత్థానము లేకుండా, మనకు రక్షకుడు లేడు, రక్షణ లేదు, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అన్నదే లేదు. పౌలు చెప్పిన రీతిగా, మన విశ్వాసము “వ్యర్థమే”, సువార్త అంతా శక్తి హీనమే, మరియు మనమింకను పాపములోనే నిలిచియుందుము (1కొరింథీ 15:14-19)

“పునరుత్థానమును జీవమును నేనే” అని యేసు క్రీస్తు ప్రభువు తెలియజేశాడు (యోహాను 11:25), మరియు ఆ వాక్యములో ఆయన జీవమునకు పునరుత్థానమునకు మూలమని తెలియజేశాడు.  యేసు క్రీస్తు ప్రభువు లేకుండా పునరుత్థానము లేదు, నిత్య జీవము లేదు. యేసు క్రీస్తు ప్రభువు జీవమును ఇచ్చుటకంటే ఎక్కువే చేశాడు; ఆయన జీవమైయున్నాడు, అందుకొరకే, మరణమునకు ఆయనపైన అధికారము లేకపోయింది. ఆయనపైన ఆనుకొనిన వారికి తన జీవమును ఇస్తాడు, ఆ విధముగా మరణముపైన మనము ఆయన విజయమును పంచుకుంటున్నాము (1యోహాను 5:11-12). యేసు క్రీస్తునందు విశ్వాసముంచినవాడు, యేసు అనుగ్రహించిన జీవమును పొందుకొని, మనము మరణమును జయించియున్నాడు కావున పునరుత్థానమును వ్యక్తిగతముగా అనుభవిస్తాడు. మరణము విజయము పొందుట అసాధ్యము (1కొరింథీ 15:53-57).

“నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు ప్రభువు మృతులలోనుండి లేపబడియున్నాడు (1కొరింథీ 15:20). మరొక మాటలో చెప్పాలంటే, మరణము తరువాత జీవితమునుకు యేసు క్రీస్తు ప్రభువు మార్గమైయున్నాడు. మానవులు మరణము తరువాత తిరిగి లేస్తారు అనేది క్రైస్తవ విశ్వాసములోని ప్రాథమిక సిద్ధాంతము, దీనికి యేసు క్రీస్తు పునరుత్థానము సాక్ష్యము, అందుకే ఆయన పునరుత్థానము ప్రాముఖ్యమైనది. ఇతర మతాల వలెకాక, క్రైస్తవ్యానికి మూలమైనవాడు మరణమును జయించి ఆయనను వెంబడించువారికి కూడా మరణముపైన విజయమునిస్తానని వాగ్దానము చేశాడు. ఇతర మతములన్నియు కూడా మనుషులచేత లేక ప్రవక్తల చేత స్థాపించబడియున్నాయి, వారి అంతము సమాధి. దేవుడు మానవునిగా శరీరధారిగా వచ్చాడని మన పాపముల కొరకు మరణించాడని, మూడవ దినమున తిరిగి లేచాడని క్రైస్తవులుగా మనకు తెలుసు. సమాధి ఆయనను బంధించియుంచలేకపోయింది. ఆయన జీవిస్తున్నాడు, నేడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు (హెబ్రీయులకు 10:12-13).

యేసు క్రీస్తు ప్రభువు తన సంఘము కోసము వచ్చినప్పుడు సంఘము ఎత్తబడు సమయములో విశ్వాసులకు పునరుత్థానమున్నదని దేవుని వాక్యము అభయమిస్తున్నది. ఆ విధమైన హామీ అపొస్తలుడైన పౌలు 1కొరింథీ 15:55లో “ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?” అని వ్రాసినట్లుగా, మన నోట గొప్ప పాటను పాడిస్తుంది (హోషేయ 13:14తో పోల్చి చూడండి).

క్రీస్తు పునరుత్థాన ప్రాముఖ్యత నేడు మనము మన ప్రభువైన యేసుకు చేయుచున్న ఆరాధనపైన ప్రభావము చూపుతుంది. పౌలు తన సంభాషణను ఈ మాటలతో  ముగించాడు: “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” (1కొరింథీ 15:58). మనము నూతన జీవమును పొందుకొనుటకు తిరిగి లేపబడతామని మనకు తెలిసినందున, మన ప్రభువైన యేసు క్రీస్తు పొందిన విధముగానే,  ఆయన కొరకు మనము కూడా శ్రమలను ఉపద్రవములను సహించుటకు సిద్ధముగానున్నాము (1కొరింథీ 15:30-32). యేసు క్రీస్తు పునరుత్థానము వలన, చరిత్ర అంతటిలో వేలమంది క్రైస్తవులు పునరుత్థానమును గూర్చిన వాగ్దానము కొరకును అదేవిధముగా నిత్యజీవము కొరకును తమ భూసంబంధమైన జీవితాలు హతసాక్షులుగా అర్పించినట్లు చూడగలము. 

ప్రతి విశ్వాసికి యేసు క్రీస్తు మరణ పునరుత్థానము విజయోత్సవమైన మరియు మహిమతో నిండిన విజయముగా నున్నది. యేసు క్రీస్తు ప్రభువు లేఖనముల ప్రకారము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు (1కొరింథీ 15:3-4). మరియు ఆయన తిరిగి రానైయున్నాడు! క్రీస్తునందు నిద్రించినవారు లేస్తారు, మరియు ఆయన రాకడవరకూ ఇంకనూ బ్రదికియున్నవారు నూతనమైన మరియు మహిమతోనిండిన శరీరాలను ధరిస్తారు (1 థెస్సలోనీ 4:13-18). ఎందుకు యేసు క్రీస్తు పునరుత్థానము ప్రాముఖ్యమైనది? ఇది యేసు క్రీస్తు  ఎవరో తెలియజేస్తున్నది. మన పక్షముగా యేసు క్రీస్తు చేసిన బలియాగమును దేవుడు అంగీకరించాడని ప్రత్యక్షముగా ఇది చూపిస్తుంది. మనలను మృతులలోనుండి తిరిగి లేపగల శక్తి దేవునికున్నదని ఇది చూపుతుంది. క్రీస్తునందు విశ్వాసముంచి నిద్రించిన వారి శరీరములు మృతముగానే నిలిచియుండక నిత్య జీవము కొరకు తిరిగి లేస్తాయని ఇది హామీ ఇస్తుంది.

 

(ఆంగ్లమూలం; Why is the resurrection of Jesus Christ important?)

 

Leave a Reply