ప్రశ్న:

యెషయా 44:24లో భూమ్యాకాశములను సృజించినపుడు  యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడని వ్రాయబడింది. యెషయా 42:1ని మత్తయి సువార్త 12:18లో ఉటంకిస్తూ యెహోవా పంపుతాను అనిన ఆయ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు అని వ్రాసారు. ఇప్పుడు (నిర్గమ 20:2-3 ప్రకారముగా) యెహోవా ఒక్కడే నిజమైన దేవుడైతే, తానొక్కడే భూమ్యాకాశములను సృజించి తన సేవకుని (అనగా యేసు క్రీస్తును) పంపినవాడైతే, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా కాదు అనేది దాని అర్థం అయ్యుండాలి. అయితే క్రైస్తవులు ఎందుకు తమ స్వంత బైబిలు బోధిస్తున్నదానికే విరుద్ధముగా మాట్లాడుతున్నారు? (*

జవాబు:

మొదటిగా గమనించితే, అడుగబడిన ప్రశ్నన యెహోవాను త్రై-వ్యక్తిత్వానికి భిన్నమైన ఏక-వ్యక్తిత్వమును కలిగినవానిగా ఊహించుచు యునిటేరియనిజమ్‌ (ఏకేశ్వరోపాసన) వారు వేసినదిగా మనము గ్రహించగలము. ఆ విధముగా ఊహించుకొని ఆ ప్రశ్నను అడుగుటనుబట్టి యేసు క్రీస్తు ప్రభువును యెహోవా పంపినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు యెహోవా కాదు అని వారు ఆలోచనచేస్తున్నారు.

అయినను, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా యెహోవా త్రియేక దేవుడైనప్పుడు, ఆ త్రిత్వములోని  ఒక దైవ వ్యక్తి మరొక దైవ వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పనిని సంపూర్ణముచేయుటకు తన సేవకునిగా పంపుటలో సమస్యలేదు.

మెట్టుకు, యెహోవా ఒక్కడే సమస్తమును సృజించాడని త్రిత్వోపాసకులందరు పూర్ణహృదయముతో అంగీకరిస్తారు. అయినను సమస్తమును సృజించిన దేవుడు ఏకాంగుడు కాదు, ఏకేశ్వరోపాసకుల దైవము కాదు. ఈ సమస్తమును సృజించుటకు యెహోవా తన ఆత్మను, తన శక్తిని, తన వాక్కును (వాక్యమును),  మరియు తన జ్ఙానమును ఉపయోగించినట్లు పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా బోధిస్తున్నది:

ఆయన ఊపిరి (రూ’ఖ్‌ – ruach) విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.” యోబు 26:13

దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను” యోబు 33:4

యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి (రూ’ఖ్‌ – ruach) చేత వాటి సర్వసమూహము కలిగెను.”  కీర్తన 33:6

యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది… నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.”  కీర్తన 104:24,30

జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను. ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.” సామెతలు 3:19-20

” నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు… అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.” యెషయా 32:13-15

ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.” యిర్మియా 10:12

యేసు క్రీస్తు ప్రభువు  దేవుని వాక్యమని, జ్ఙానమని మరియు శక్తియని క్రొత్తనిబంధన తెలియజేయుచున్నది:

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” యోహాను సువార్త 1:1-3

… యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.” 1కొరింథీయులకు 1:24

జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.” 1యోహాను పత్రిక 1:1-3

రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” ప్రకటన 19:13

ఈ కారణము చేతనే క్రొత్తనిబంధన రచయితలు ఏకేశ్వరవాదంతో లాలూచీ పడకుండ అంతటి మిక్కిలి ఉన్నతమైన మాటలతో క్రీస్తు విషయమై మాట్లాడ గలిగి యున్నారు. దేవుని వాక్యము, జ్ఙానము మరియు శక్తి భిన్నమైన దేవుళ్లు కాదు గాని దేవునిలో స్వతస్సిద్ధముగా కనబడు కోణములని యేసు క్రీస్తు ప్రభువు దినాలలో ఉన్న యూదామతమునకు తెలుసు. ఆవిధముగా, క్రొత్తనిబంధన యేసు క్రీస్తు ప్రభువును శాశ్వతమగు దేవుని వాక్యముగాను, జ్ఙానముగాను మరియు శక్తిగాను వర్ణించడమంటే, యేసు క్రీస్తు ప్రభువు స్వతస్సిద్ధముగానే అద్వితీయ సత్య దేవుని  నిజ స్వరూపమై యున్నాడని తెలియజేయుచున్నది. మరొక మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు ప్రభువు దేవుడు కాక వేరొకరు కాదు, తత్వమునందు సంపూర్ణముగా దేవుడు. అదే సమయములో, యేసు క్రీస్తు ప్రభువు అనబడే వ్యక్తి యొక్కడే దేవుడు కాదు, తండ్రి మరియు పరిశుద్ధాత్మ కూడా దేవుడు.

మెట్టుకు,  యెషయా 42:1 లో యేసు క్రీస్తు ప్రభువును సేవకునిగా చూపినప్పటికీ, అదే యెషయా ఆ సేవకుని గురించి యెహోవా బాహువు అనగా యెహోవాయే అని చెప్తున్నాడు:

సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ  చూచెదరు.యెషయా 52:10 

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన  మొక్కవలెను  అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు  మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను  మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని  ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి  నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు  దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము  అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెనుయెషయా 53:1-12

పై వాక్యభాగాలు యెహోవా సేవకుని ఏవిధముగా సాక్షాత్కరిస్తున్నాయంటే, దేవుని ప్రజల పక్షముగా మరణించి వారిని విమోచించటానికి పంపబడిన దేవుని శక్తిగా ఆయనను సాక్షాత్కరించుచున్నవి. ఆ సేవకుని యెహోవా బాహువు అని పిలుచుటవలన, ఆ సేవకుడు కేవలము మానవుడు మాత్రమే కాదు, నిత్యుడైన దేవునిలో స్వతస్సిద్ధమైన భాగము అని యెషయా భక్తుడు తెలియజేయుచున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, 1కొరింథీ 1:24లో అపొస్తలుడైన పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి యేసు క్రీస్తు ప్రభువు దేవుని శక్తియని నిరూపణగా చెప్పిన మాటలలో ప్రవక్తయైన యెషయా మాటలు ప్రతిద్వనిస్తున్నాయి! మరియు దేవుని శక్తి నిత్యమైనది, దైవికమైనది అని దిగువనీయబడిన లేఖనాలు తెలియజేస్తున్నాయి:

ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.” రోమా 1:20

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును  భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,” 2పేతురు 1:3

దీని అర్థము ఆ యేసు క్రీస్తు ప్రభువు ఖచ్చితముగా నిత్యుడైన దైవము!

ఇంతేగాక, యెహోవాకున్న స్థానము మరియు స్థాయిలోనికి ఆ సేవకుడు హెచ్చింపబడినట్లు కూడా యెషయా చెప్పుచున్నాడు:

ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.” యెషయా 52:13-15

మరొకచోట,  యెహోవా మాత్రమే హెచ్చింపబడి ఘనత పొందినట్లు యెషయా చెప్పుచున్నాడు:

నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును… అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.” యెషయా 2:11,17

యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను… యెహోవా ఇట్లనుకొనుచున్నాడు – ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.యెషయా 33:5,10

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.” యెషయా 57:15

ఈ చివరి వచన భాగంలో దైవాత్మావేశుడైన ప్రవక్త యెహోవాను ఘనతనొందిన వానిగాను మరియు వినయముగల దీనులయొద్ద నివసించుచున్నవానిగాను చూపిస్తున్నాడు. విరిగి నలిగిన హృదాయాలుగల వారితో నివసించుచున్న దేవుని యొక్క తగ్గింపు జీవితము మరియు సమ్మతిగల మనస్సుకు సేవకునిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువు ప్రతీక!

యెహోవాకు మాత్రమే చెందిన స్థానములో ఆ సేవకుడు  ఘనపరచబడ్డాడు అనే వాస్తవికత ఆ సేవకుడు  యెహోవాయొక్క వ్యాపకము, ప్రత్యక్షత అనటానికి మరింత బలమైన ఆధారమును అందిస్తుంది. తార్కికంగా ఇది ఎలా వర్తిస్తుందో గమనించండి:

  1. యెహోవా మాత్రమే ఘనత నొందియున్నవాడు మరియు ఉన్నత స్థలమందున్నవాడు.
  2. ఆ సేవకుడు ఘనతనొంది ఉన్నత స్థలమందున్నాడు.
  3. కావున, ఆ సేవకుడు యెహోవా దేవుడు.

ఆ విధముగా, యెషయా మరియు పరిశుద్ధాత్మ ప్రేరణచే వ్రాయబడిన పరిశుద్ధ బైబిలు గ్రంథములోని ఇతర పుస్తకాలు, వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వమును తృణీకరించుటలేదు గాని యేసు క్రీస్తు ప్రభువు శరీరమును దాల్చిన యెహోవా దేవుడు అని రుజువు పరుస్తున్నాయి.

ఈ అంశముపైన ఇంకా ఎక్కువగా తెలిసికొనుటకు మరుసటి వ్యాసమును చదవండి: యెషయా మరియు క్రొత్త నిబంధన వివరణల వెలుగులో మెస్సీయా యొక్క దైవత్వము.

 

 

(ఆంగ్లమూలం; If Yahweh alone is the Creator, and Jesus a servant sent by him, how can Jesus be God?, by Sam Shamoun)

Leave a Reply