ప్రశ్న: 

తండ్రి అద్వితీయ సత్యదేవుడని యేసు క్రీస్తు ప్రభువే అంటున్నారు. త్రిత్వోపాసకులేమో తండ్రి మరియు కుమారుడు వేర్వేరు వ్యక్తులు, ఒక్కడే వ్యక్తి కాదు అంటారు. యేసు క్రీస్తు ప్రభువు దేవుడు అనుటను ఆయనే తృణీకరిస్తున్నట్లు ఇది రుజువు చేయుటలేదా?

జవాబు:

పై ప్రశ్నను అడుగుతున్నవారు స్పష్టముగా ఏకేశ్వరోపాసనను అనగా ఒకే ఒక వ్యక్తి యైన దేవుడు (పేరుకు తండ్రి) మాత్రమే ఉన్నాడని ఊహించుకుంటూ, ఆ ఊహను లేఖనభాగానికి అంటగట్టుతూ అడుగుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన విషయమును సరిగా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా ఆ లేఖన భాగాన్ని దాని పూర్వోత్తరభాగ సంధర్భమంతటిని చదవాలి:

యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను – తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము… నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుకనావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము… మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు  ఏకమైయుండవలెనని  వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.” యోహాను సువార్త 17:1-5, 7, 10-11, 20-26

పైన చెప్పబడిన వాక్యభాగమునుండి మనము గమనించదగినదేమనగా:

  1. యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు.
  2. యేసు క్రీస్తు ప్రభువు దేవుడు తనకు దయచేసినవారికందరికి నిత్యజీవమునిస్తాడు, మరియు ఇది తాను దైవమునని చెప్పుకొనుచున్న వాంగ్మూలము, ఎందుకనగా దేవుడు మాత్రమే నిత్యజీవమునీయగలవాడైయున్నాడు.
  3. యేసు క్రీస్తు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రితో కలిసి మహిమలో ఉన్నాడు.
  4. యేసు క్రీస్తు ప్రభువు దేవుని చేత మహిమ పరచబడవలెనని అడుగుచున్నాడు, ఆవిధముగా ఏ ప్రాణియు ఎప్పుడునూ అడుగజాలదు.
  5. యేసు క్రీస్తు ప్రభువు తండ్రికి కలిగిన వన్నియు తనవేనని చెప్పారు, అనగా ఈ మాటలు ఉనికి కలిగియున్న ప్రతిదానికి ఆయనే వారసుడు అని తెలుపుచున్నవి.
  6. యేసు క్రీస్తు ప్రభువు విశ్వాసులలో నివసిస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభువు దేవుడు అనుటకు ఇది ఒక ఆనవాలు, కనుకనే ఆయన దేవుడైయున్నాడు ఎందుకనగా దేవుడు మాత్రమే సర్వవ్యామి అయియున్నాడు.
  7. తండ్రి ప్రేమకు లక్ష్యముగా (కర్మగా) యేసు క్రీస్తు ప్రభువు లోకము పుట్టకమునుపే ఉన్నాడు.

ఆ విధముగా, దేవుడు మాత్రమే చేయగల వాంగ్మూలమును యేసు క్రీస్తు ప్రభువు చేసియున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు తండ్రిని గురించి అద్వితీయ సత్యదేవుడు అని చెప్పుటలో తాను దేవుడను కాను అనే అర్థము ఏ విధముచేతనైనా రాదని దాని పూర్వోత్తర సందర్భము వలన స్పష్టముగా తెలుస్తుంది. నిజముగానే తండ్రి అద్వితీయ సత్యదేవుడు కాబట్టే యేసు క్రీస్తు ప్రభువు ఆ మాట చెప్పారు, అయినను ఆ అద్వితీయ సత్యదేవుడు ఒక వ్యక్తికంటే ఎక్కువమందిగా ఉనికి కలిగి యున్నారు అని అదే పరిశుద్ధగ్రంథము మనకు తెలుయజేస్తుంది. అనగా కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు కూడా సత్యదేవుడేనని పరిశుద్ధ లేఖనములు తేటగా చూపెడుతున్నాయి.

కావున, ఒక్కడైయున్న సత్యదేవుడు అనగా అద్వితీయ సత్యదేవుడు త్రిత్వముగా ఉనికిని కలిగి యుండగా, త్రిత్వముగా ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను అద్వితీయ సత్యదేవుడని పిలువవచ్చు. అది ఒక్కొక్కరినిగా పిలిచినా లేక ముగ్గురుని కలిపి పిలిచినా వారిని అద్వితీయ సత్యదేవుడని పిలువవచ్చు. దీనిని మరొక విధానములో చెప్పాలంటే:

  • త్రిత్వము అద్వితీయ సత్యదేవుడు
  • త్రిత్వములోని ప్రతీ వ్యక్తియు అద్వితీయ సత్యదేవుడు.
  • కావున, త్రిత్వములోని వ్యక్తులు ఒక్కొక్కరిగానైనను లేక ముగ్గురుని కలిపి పిలిచిననూ వారు అద్వితీయ సత్యదేవుడుగా ఉన్నారు.

ఇందు కారణమును బట్టి త్రిత్వములోని ఒక వ్యక్తిని గురించి యేసు క్రీస్తు ప్రభువు అద్వితీయ సత్యదేవుడు అని సంబోధించినంతమాత్రాన ఇతర వ్యక్తులు దేవుడు కాదు అని ఎంతమాత్రము కాదు. ఈ విషయము ఇంకా స్పష్టముగా అర్థముకావాలంటే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాయబడిన హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఏమి చెప్తుందో గమనించండి:

గాని తన కుమారునిగూర్చియైతే – దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు – ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:8-12

కుమారుణ్ణి దేవుడు, ప్రభువు, నిత్యుడగు రాజు, సృష్టియంతటికి కర్తయు దానిని కాపాడువాడును అని తండ్రి ఆయనను స్తుతిస్తున్నాడు! మరియు ఇవే లేఖనములు యేసు క్రిస్తు ప్రభువు అందరికీ అద్వితీయ నాధుడు, ప్రభువు అని చెప్పుచున్నవి:

ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.” యూదా వ్రాసిన పత్రిక 1:4

అలాగని తండ్రి దేవుడు కాదు, సర్వాధికారి కాదు, ప్రభువు కాదు మరియు భూమ్యాకాశములను సృజించినవాడు కాదు అని దీని అర్థమా? జవాబు చాలా స్పష్టముగా తెలుస్తుంది. పరిశుద్ద గ్రంథము ప్రకారముగా తండ్రి కూడా కుమారుని వలెనే దేవుడు, అధికారి, ప్రభువు, విశ్వ సృష్టికారకుడు మరియు దానిని కాపాడువాడు అని తెలుస్తుంది. ఆ విధముగానే తండ్రిని అద్వితీయ సత్యదేవుడని మహిమ పరచటము వలన తాను సంపూర్ణ దైవము కాదన్నట్లుగా కుమారుడు తనకు తానే తృణీకరించుకుంటున్నట్లు అర్థము రాదు అని గ్రాహ్యమౌతుంది.

వాస్తవానికి, యోహాను 17:3ను జాగ్రత్తగా చదివితే యేసు క్రీస్తు ప్రభువు తన సంపూర్ణ దైవత్వమును తృణీకరించుటలేదనే విషయమును బలపరచబడుతుంది:

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.” యోహాను 17:3

ఇక్కడ మూల భాషను గనుక మనము చూచినట్లయితే “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, మరియు (కై) నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవవము.” అని వ్రాయబడింది. “మరియు (కై)” అనే సముచ్చయము తెలుగులో వాడబడలేదు గాని దానికి బదులు “కామా ( , )” వాడబడింది. ఎందుకనగా మన తెలుగు వ్యాకరణములో “కామా ( , )” సందర్భమును బట్టి “మరియు” అని అర్థమునిస్తుంది.

ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రార్థనలో గ్రీకు సముచ్చయమైన “కై” అనే పదమును వాడి, నిత్యజ్ఞానమునకు నడిపించబడాలంటే తనను కూడ ఎరిగియుండుట ఆవశ్యమని స్పష్టము చేసాడు. మరోమాటలో చెప్పాలంటే, తండ్రిని మరియు కుమారుని ఎరుగియుండుటముపైనే నిత్యజీవము అధారపడియున్నదని చెప్పుట ద్వారా యేసు క్రీస్తు ప్రభువు  ప్రథమముగా తండ్రితో తనను తాను సమభాగస్వామిగా చేసికొన్నాడు. ఒక వ్యాఖ్యాన గ్రంథము ఇలా చెప్తుంది:

మరియు నీవు పంపిన యేసు క్రీస్తును — మన ప్రభువు తన పూర్తి పేరును తనకు తానుగా చెప్పుకొన్నది ఇక్కడ ఒక్కచోటనే, తరువాత అపొస్తలుల బోధలోను మరియు వ్రాతలలోను మనము చూస్తాము. ఇక్కడ పదాలు వాటి ఖచ్చితమైన భావముతో వాడబడినవి — ఎందుకనగా ఆయనే “తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును” గనుక “యేసు” అనియు; “రక్షించుటకు నీవు పంపిన” వానికున్న రక్షణ కార్యాలను దైవ అధికారములోను మరియు శక్తితోను సాధకముచేయుటకు పరిశుద్దాత్మచేత కొలతలేని పరిపూర్ణ అభిషేకమునొందినవానిగాక్రీస్తు” అనియు వాడబడినవి. “ఇక్కడ తండ్రితో అతి సామీప్యముగా, తండ్రి ప్రక్కనే యేసు క్రీస్తు ఉండటమే మన ప్రభువు యొక్క దైవత్వమునకు రుజువుగా ఉన్నది. దేవుని గూర్చినట్టియు మరియు ఒక ప్రాణిని గురించినట్టియు జ్ఞానము నిత్యజీవము కానేరదు. ఆ విధముగా ఒకదానితో ఒకటి కలిసి యుండటము అనేది కూడా అనూహ్యమైన విషయము.” [అల్ఫార్డ్‌]. (Jamieson & Fausset & Brown, Commentary Critical and Explanatory on the Whole Bible; ఆధారం; లావుపాటి, ఏటవాలు, క్రింది గీత గీచి చేసిన ఒక్కాణింపు మాది)

ప్రఖ్యాతి గాంచిన బైబిలు వ్యాఖ్యానకర్త కీర్తిశేషులు జాన్‌ గిల్‌గారు ఈవిధముగా చెప్పారు:

…ఏరియన్లు (యేసు క్రీస్తు ప్రభువునకు ఆది అనగా పుట్టుక ఉన్నదని నమ్మేవారు) మరియు యునిటేరియన్లు అనగా ఏకేశ్వరోపాసకులు (దైవత్వములో ఒకడే వ్యక్తి ఉంటాడు అని నమ్మేవారు) ఈ లేఖనభాగాన్ని తీసుకొని మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రితో ఉన్న సమానతకు మరియు ఆయన వాస్తవికమైన సరియైన  దైవత్వానికి విరుద్ధముగా వాడుతుంటారు, గాని అది  విఫలయత్నమే; అనేక అబద్ధపు అన్య దేవతలకు భిన్నంగా, తండ్రి అద్వితీయ సత్యదేవుడని పిలువబడుతున్నాడు అయినను ఇందులో కుమారుడు లేక పరిశుద్ధాత్ముడు మినహాయింపబడలేదు; అలాగే క్రీస్తు కూడా  అద్వితీయ ప్రభువుగాను మరియు ఆయన మాత్రమే అద్వితీయ నాథుడైన ప్రభువుగాను పిలువబడ్డారు, అయినను ఇందులో తండ్రియైన దేవుడు మినహాయింపబడలేదు; ఆయనే నిజదేవుడును నిత్యజీవమునైయున్నాడు; ఆయన అలాంటి వాడు కాని పక్షంలో, ఈ వాక్యభాగంలో చెప్తున్నట్లుగా, అద్వితీయ సత్యదేవునితో తన్నుతాను సమానం చేసికొనగలిగేవాడు కాదు; అంతే కాకుండా, నిత్యజీవమును పొందుటకు తండ్రిని ఎరుగుట మాత్రమే కాకుండా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును కూడా ఎరుగుట (ఆయనను గురించిన జ్ఙానము కలిగియుండుట) ఆవశ్యకమని తెలియజేయబడింది. యేసు క్రీస్తు ప్రభువు మానవ రక్షణార్థమై అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన మధ్యవర్తియైన క్రీస్తు వ్యక్తిత్వాన్ని కలిగియున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ ఒక విభిన్న రీతిలో మాట్లాడుటకు కారణమైయున్నది. నిజదేవుడు కేవలము అద్వితీయ సత్యదేవుడని యేసు క్రీస్తు ఈ వచనంలో ఒప్పుకొంటున్నారని, ఆయన ఈ వచనంలో తన్నుతాను దేవునిగా పిలుచుకొనలేదు, కాని దేవుడు పంపిన మెస్సీయగానే చెప్పుకున్నారు; అంతేకాకుండా, అపొస్తలుడైన పౌలు కూడా దేవుడు కేవలము అద్వితీయుడని 1తిమోతి 1:17 లో రూఢిపరచుచున్నారు;  కాబట్టి యేసు క్రీస్తు దేవుడు కాజాలరు అని యూదులు చేయపూనుకొనే ఆరోపణ ఇక్కడచెల్లదు. ఎందుకనగా, ప్రభువైన యేసు క్రీస్తు మరియు క్రీస్తునకు తండ్రియైన అద్వితీయ దేవుడు ఏకమైయున్నారు; తననుతాను ఇక్కడ తండ్రితో జతపరచుకొని మాట్లాడుట ద్వారా ఆయన తండ్రితో పాటుగా తానును అద్వితీయ సత్యదేవుడనై యున్నానని చెప్పకనే చెప్పుచున్నారు. అపొస్తలుడైన పౌలు అద్వితీయుడైన దేవుని గురించి పలికిన మాటలు తండ్రితో సమానుడైన దేవుని కుమారుని గురించి కూడా పలికినవేనని మనము గ్రహించవచ్చు; ఎందుకనగా, ఆ వచనములోని లక్షణములన్నీ ప్రభువైన యేసు క్రీస్తునకు సరిపోవుచున్నవి, అంతేకాకుండా సందర్భానుసారంగా చూచినా యేసు క్రీస్తు ప్రభువు తన గురించే అక్కడ మాట్లాడుచున్నారు. (ఆధారం; లావుపాటి అక్షర వొక్కాణింపు మాది)

రక్షణ పొందుటకు తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు ఇరువురు ప్రాముఖ్యమైనవారుగా చూపటము, యేసుక్రీస్తు దేవుని కుమారుడును మరియు లోకరక్షకుడునై యున్నాడని తెలియజేయుచున్న సువార్త బోధ వెలుగులో సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది:

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను… ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి… ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె (దేవుడే) (మోనొగెనేస్ థియోస్‌) ఆయనను బయలు పరచెను.” యోహాను సువార్త 1:1-4, 10, 14, 18

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.” యోహాను సువార్త 3:16-18

ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి – ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.” యోహాను సువార్త 4: 41-42

దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” యోహాను సువార్త 6:50-51

ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.” యోహాను సువార్త 12:47

అందుకు తోమా ఆయనతో – నా ప్రభువా, నా దేవా అనెను. యేసు – నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన యితర సూచకక్రియలను  యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” యోహాను సువార్త 20:28-31

మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.” 1యోహాను 4:14

కనబడుచున్నట్లుగా,  యోహాను వ్రాసిన సువార్తలో గాని, లేక పరిశుద్ధ గ్రంథమంతటా గాని ప్రభువైన యేసు క్రీస్తు తత్వమందు సంపూర్ణ దేవుడు అని చెప్పబడుచున్న సందేశమును, యోహాను సువార్త 17:3 తృణీకరించుట లేదు.

 

 

(ఆంగ్లమూలం; How can Jesus be God, when he calls the Father the only true God?, by Sam Shamoun)

Leave a Reply