“మీ క్రైస్తవులు చెప్పుకుంటున్నట్లుగా, యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే ఆ విషయము ఆయన ఎందుకని స్పష్టముగా చెప్పలేదు?” అని కొందరు అడుగుతుంటారు. మరి కొందరు, “యేసు క్రీస్తు ‘నేను దేవుడిని’ అని చెప్పినట్లు బైబిలులోనుండి ఒక్క చోట చూపించినా నేను నమ్ముతాను” అంటారు. ఇంకా కొంతమందైతే  యేసు “దేవుడు” అని బైబిలు చెప్పటము లేదు అని నమ్ముతారు, కాని అత్యుత్సాహం కలిగిన క్రైస్తవులు ఆయన ఎవరో వివరించబోయి ఒకటిని పదింతలుగా విస్తరించి చెప్పటానికి పూనుకుంటారు.

యేసు క్రీస్తు ప్రభువు తనను తాను బాహాటముగా చూపించుకొనుటకు బదులుగా, సాధ్యమైనంత వరకు తనను తాను మరుగుచేసుకొనుటకు ప్రయత్నించడం చూస్తే క్రొత్తగా అనిపిస్తుంది.  ఆయన “ప్రసిద్ధ వ్యక్తిగా” పేరుపొందాలనుకుంటున్నాడేమోనని పొరబడిన ఆయన సొంత కుటుంబీకులు కూడా ఆయనలోని ప్రవర్తన క్రొత్తగా ఉండటం చూసారు:

యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి – నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.” (యోహాను సువార్త 7:2-5)

కావున యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన సత్యము ఏమిటి?

మొదట యేసు క్రీస్తు ప్రభువు తన గురించి తాను ఏమి చెప్పుకున్నారో చూద్దాము:

A) యేసు క్రీస్తు అనబడిన మెస్సీయా తనను తాను పూర్తిగా బయలు పరచుకోవటానికి సముఖతను చూపలేదు:

1. యేసు తన గురించి తాను చాలా అరుదుగా చెప్పుకున్నాడు:

a) యేసు దేవుడు:

ఎక్కువ మాటలు ఉపయోగించి స్పష్టముగా “నేను దేవుడను” అని యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడా చెప్పుకోలేదు. కాని ఆయన పరోక్షముగా ఆ విషయమునుతెలియజేశారు:

కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు – ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.” (యోహాను సువార్త 6:41,42)

యేసు – అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.” (యోహాను సువార్త 8:58-59)

[గమనిక: “నేను ఉన్నాను” అనే మాటలు మూలభాషలో దేవుడు తన గురించి తాను మోషేతో మాట్లాడినప్పుడు వాడిన మాటలు. ఎవరైనా దైవ దూషణ చేసినప్పుడు తగిన శిక్షగా వారిని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది.]

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.” (యోహాను సువార్త 17:4-5)

b) యేసు క్రీస్తనబడిన మెస్సీయా:

యేసు క్రీస్తు ప్రభువు సంత వీధులలో నిలవబడి  “నేనే క్రీస్తును” అని ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన ఏకాంతముగా సమరయ స్త్రీతో మాట్లాడుచున్నపుడు “నేనే ఆయనను (క్రీస్తును) అని చెప్పాడు, మరియు నీవు క్రీస్తువా అని యూదులు ఆయనను ప్రశ్నించినపుడు తాను క్రీస్తు అనే విషయమును ఆయను తృణీకరించలేదు.

ఆ స్త్రీ ఆయనతో – క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు – నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.” (యోహాను సువార్త 4:25-26)

అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి – నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు – నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా” (మత్తయి సువార్త 26:63-64)

[గమనిక: “క్రీస్తు” అనే పదము హీబ్రూలోని “మెస్సీయా” అనే పదమునకు గ్రీకు భాషాంతరము.]

c) యేసు ప్రవక్త:

యేసు క్రీస్తు ప్రభువు “నేను ప్రవక్తను” అని దరీ దాపుగా ఎన్నడూ చెప్పుకోలేదు. ఇక్కడ ఒకచోటనే ఆ విషయం ప్రస్తావించబడింది:

ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు – ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.” (మత్తయి సువార్త 13:56-58)

d) యేసు దేవుని కుమారుడు:

నేను “దేవుని కుమారుడిని” అని యేసు క్రీస్తు ప్రభువు తనకు తాను చాలా అరుదుగా పిలుచుకున్నారు. నీవు దేవుని కుమారుడవైతే ఆ విషయము స్పష్టముగా చెప్పుమని యూదులు ఆయనను అడిగినప్పుడు నేను దేవుని కుమారుడిని అనే విషయమును ఆయన తృణీకరించలేదు.

ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి – నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన – నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన – మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.” (లూకా సువార్త 22:66-70)

చాలామంది ప్రజలు యేసు క్రీస్తు ప్రభువును  “దేవుని కుమారుడు” అని పిలిచేవారు, ఆయన ఎన్నడూ ఆ విషయమును తృణీకరించలేదు. ఇక్కడ కొన్న ఉదాహరణలు చూడండి:

– వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.” (మత్తయి సువార్త 27:42,43)

వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి – నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.”  (మత్తయి సువార్త 14:32,33)

వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి – యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను. ఏలయనగా ఆయన – ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను.” (లూకా సువార్త 8:28,29)

దేవుడిని తన “తండ్రి” అని తరచుగా పిలవడం ద్వారా తాను దేవుని కుమారుడు అనే విషయమును యేసు క్రీస్తు ప్రభువు రూడిపరిచాడు. [క్రొత్త నిబంధనలో సుమారు 117 సార్లు  వ్రాయబడింది.]

ఆయన తనను తాను “దేవుని కుమారుడను” దరీ దాపుగా ఎన్నడూ చెప్పుకోలేదు (దిగువనీయబడిన నాలుగు ఉదాహరణలు చూడండి):

… – నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” (యోహాను సువార్త 10:35-36)

మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను” (యోహాను సువార్త 5:25,26)

యేసు అది విని – యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.” (యోహాను సువార్త 11:4)

e) యేసు మనుష్య కుమారుడు:

యేసు క్రీస్తు ప్రభువు తన గురించి తాను సంబోధించుకున్న ప్రతిసారి (50కంటే ఎక్కువ సార్లు) “మనుష్య కుమారుడు” అనే సంబోధించుకున్నారు, మరియు దీనికి ఒక సాధారణ మానవుడు అనియు అలాగే ఆదాము సంతతివాడు అనియు సాధారణమైన అర్థము వస్తుంది.

2. అంతేగాక, ఆయన ఎవరో సంపూర్ణముగా గుర్తించినవారితో ఆ విషయమును ఎవరికీ చెప్పవద్దని ఆయన ఖండితముగా ఆజ్ఞాపించాడు:

a) ఆయన శిష్యులకు:

అందుకాయన – మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు – నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని [క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము] చెప్పెను… అటుపిమ్మట తాను క్రీస్తు  అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.” (మత్తయి సువార్త 16:15,16,20; మార్కు సువార్త 8:29,30 వచనాలు కూడా చూడండి)

b) దయ్యములకు:

ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.” (మార్కు సువార్త 1:34; 24,25వచనాలు కూడా చూడండి)

అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి – నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.” (మార్కు సువార్త 3:11-12)

ఇంతేకాక దయ్యములు – నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.” (లూకా సువార్త 4:41)

c) ఆయన స్వస్థపరచినవారికి:

…బహు జనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.” (మత్తయి సువార్త 12:15-16)

అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి – నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు – ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.” (మత్తయి సువార్త 8:3-4)

వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.” (మార్కు సువార్త 5:42-43)

3. తన దైవత్వమును నిరూపించమని సవాలు విసిరినపుడు యేసు ఆ సవాలును అంగీకరించలేదు:

a) సాతాను:

ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి – నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను… – నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము… అని …ఆయనతో చెప్పెను.” (మత్తయి సువార్త 4:3,6)

b) సామాన్య ప్రజలు:

ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు – దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి” (మత్తయి సువార్త 27:39-40)

c) శాస్త్రులు, పెద్దలు, ప్రధానయాజకులు:

ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు – వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. 43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.” (మత్తయి సువార్త 27:41-43)

4. సామాన్యముగా యేసు ప్రజలతో ఉపమానరీతిగా మాట్లాడుచుండెను:

నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.” (మత్తయి సువార్త 13:34-35)

 

B) యేసు క్రీస్తు అనబడిన మెస్సీయా తనగురించి తాను పూర్తిగా బయలు పరచుకొనక పోవటానికి గల కారణాలు:

1. ఆయనను గురించి తెలుసుకోవటము మానవ గ్రాహ్యశక్తికి మించినది, ఆ సత్యమును తెలుసుకొనుట కేవలము దేవునిచేత బలపరచబడిన విశ్వాసులకు మాత్రమే అనుగ్రహింపబడింది అనే విషయము యేసు క్రీస్తు ప్రభువుకు తెలుసు కాబట్టి:

యేసు క్రీస్తు అనబడిన మెస్సీయా సంత వీధులలో నిలబడి “నేను దేవుడిని! నన్ను ఆరాధించండి!” అని ప్రకటిస్తే ప్రజలు ఎంతమంది ఆయనను నమ్మి ఆయనను ఆరాధించేవారు అని నీవు అనుకుంటున్నావు?

a) దేవుడు బయలుపరచినప్పుడు మాత్రమే మానవుడు గ్రహించగలిగిన రెండు విషయములు క్రీస్తునందున్నవి:

  1. నిజముగా యేసు ఎవరు అనే విషయము:”అందుకు సీమోను పేతురు – నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు – సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలు పరచలేదు.” (మత్తయి సువార్త 16:16-17)
  2. సిలువలో యేసు చేసిన కార్యము యొక్క నిజమైన అర్థము:”సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము… ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీయులకు 1:18; 2:14)

b) ఆయనను నిజముగా ప్రేమించినవారికే యేసు తనగురించి తాను బయలుపరచుకున్నాడు:

నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా – ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా యేసు – ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.” (యోహాను సువార్త 14:21-23)

c) ఆయనను నిజముగా ప్రేమించినవారికి యేసును గూర్చి దేవుడు ఈ విధముగా బయలుపరచుచున్నాడు:

  1.  యేసు క్రీస్తుని గూర్చిన ఈ మర్మమైన జ్ఞానమును అద్భుతమైన విధముగా మనకు దేవుని పరిశుద్ధాత్మ బయలు పరచుచున్నాడు:”దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. ఇందును గూర్చి – దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.” (1 కొరింథీ 2:7-12)
  2. దేవుని వాక్యము ద్వారా యేసు క్రీస్తు ప్రభువు మనకు అద్భుతముగా బయలుపరచబడియున్నాడు:”యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” (యోహాను సువార్త 20:31; ఇవి కూడా చూడండి- యోహాను 5:39-40; రోమీయులకు 16:25-26; ఎఫెస్సీయులకు 3:4-5)
  3. క్రీస్తును పొందుకొనుటకు తండ్రియైన దేవుని చేత విశ్వాసులు అద్భుతముగా బలపరచబడియున్నారు:”తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; …నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు;తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.” (యోహాను సువార్త 6:38,45,65)

2. తన ప్రధాన ఉద్దేశ్యము మరియు సందేశము నుండి ప్రజలు వేరే వైపునకు మళ్లించబడటం యేసుకు ఇష్టం లేదు కాబట్టి:

మన పాపముల నిమిత్తమై మనకు బదులుగా సంపూర్ణ ప్రాయశ్చిత్తము చెల్లించటానికి, మనవలెనే ఆయన సంపూర్ణమైన మరియు ఖచ్చితమైన మానవునిగా మొదటిసారి ఈ భూమిమీదికి వచ్చాడు. ఆయనను ఆరాధించే వారి కోసము లేక ఆయనను గౌరవించేవారి కోసము ఆయన చూడ లేదు. కాని, ప్రజల నాశనకరమైన పాప ఫలితాలనుండి వారిని రక్షించుటకు సంపూర్ణమైన మానవునిగా వచ్చిన వారి రక్షకునిగా ఆయనను అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. తాను దేవుడననో, ఇశ్రాయేలు రాజుననో లేక గొప్ప ప్రవక్తననో ప్రజలకు చూపించుకుంటే తన ఈ ఉద్దేశ్యము చెదరిపోతుంది. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను మహిమను కీర్తిని పొందుకుంటాడు.

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.” (మత్తయి సువార్త 20:28)

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.” (లూకా సువార్త 19:10)

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.” (ఫలిప్పీయులకు 2:5-8)

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1 తిమోతి 2:5-6)

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.” (తీతుకు 2:14)

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను.” (1 పేతురు 1:18-20)

3. యేసు క్రీస్తు ప్రభువు నిజముగా ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు అనే సంగతిని గుర్తించలేనంతగా అనేక మంది హృదయాలు కఠినపరచబడి సాతానుకు లోబడియున్నవని ఆయన ఎరిగియున్నారు కాబట్టి:

తరువాత శిష్యులు వచ్చి – నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను – పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు … మరియు – వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ‘ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు’ అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.” (మత్తయి సువార్త 13:10-15)

ఆయన [యేసు] లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయుల [ఇశ్రాయేలీయుల] యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.” (యోహాను సువార్త 1:10-11)

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత [సాతాను] అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.” (2 కొరింథీయులకు 4:4)

దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.” (1 కొరింథీయులకు 2:7-8)

 

c) వాస్తవానికి, దేవుడు బయలుపరచిన వారికే దేవుని మర్మమైయున్న జ్ఞానము తెలుస్తుందని చెబుతున్న అనేక వాక్యాలతో పరిశుద్ద బైబిలు గ్రంథము నిండియున్నది:

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వితీయోపదేశకాండము 29:29)

ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.” (యెషయా 45:15)

తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను” (యెషయా 48:6)

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.” (యిర్మియా 33:3)

ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.” (దానియేలు 2:22)

“- వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది” (యోహాను సువార్త 6:45)

సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని  దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను  కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. … నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపలేదు, …. అది యీ లోక జ్ఞానము కాదు, …  దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము;  ఈ జ్ఞానము మరుగైయుండెను.” (1 కొరింథీయులకు 2:1-8)

… దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి… క్రీస్తు మర్మము…”  (కొలొస్సయులకు 2:2,3; 4:3 – మరియు 1:26,27 కూడా చూడండి)

 


(ఆంగ్ల మూలము: Why did Jesus not openly reveal his full identity? by Rev. Richard P. Bailey)

Leave a Reply