ప్రశ్న:

తండ్రి తనకంటే గొప్పవాడని యేసుక్రీస్తు చెప్పాడు, ఆ మాట తాను దేవుడు కాదు అని రుజువు చేస్తుంది. దేవునికంటే గొప్పవారు మరి ఎవ్వరూ లేరు.

జవాబు:

ప్రశ్నించబడిన వాక్య భాగమును ఇక్కడ వ్రాస్తున్నాము:

నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.” యోహాను సువార్త 14:28

ఆక్షేపకుడు (ముస్లిం)  ఏకేశ్వరోపాసన విశ్వాసం (అనగా ఉనికిగాను వ్యక్తిగాను దేవుడు ఒక్కడే అనే నమ్మకం) కలిగినవాడు. కావున, తనకంటే గొప్పవాడున్నాడని దేవుడు చెప్పటం అంటే అతనికి అర్థంకాదు. అయితే త్రిత్వోపాసకులు నమ్ముచున్నట్లుగా దేవుడు త్రిత్వమైతే అనగా నిత్యుడైన ఒక దేవుడే అవిభక్తమైన (వేరుచేయ సాధ్యము కాని), ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నట్లయితే అప్పుడు దైవత్వములోని ఒక సభ్యుడు లేక వ్యక్తి మిగిలిన వారికంటే కొన్ని విషయములలో గొప్పవానిగా కనబడటం అంత జటిలమైన విషయంకాదు. పరిశుద్ధ త్రిత్వమునకు వెలుపల గొప్పది మరేదియు ఎప్పటికిని లేదు అనేది వాస్తవము, అయితే దీనిని పట్టుకొని త్రిత్వము యొక్క అంతర్జీవనములోను సహవాసములోను ఒక విధమైన అధికారము లేక స్థాయి అనేది ఉండదు అని భావించవలసిన అవసరతలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అనుమతిస్తే, ఈ అంశమును గురించి తరువాతి ప్రకరణములో ఎక్కువగా నేర్చుకుందాం.

ఇప్పుడైతే, తండ్రి తనకంటే గొప్పవాడు అని చెప్పుటలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఏమి తెలియచేయాలని అనుకున్నారో దానిని తెలుసుకుందాం. ముఖ్యముగా, “గొప్పవాడు” (గ్రీకు – మెయ్జోన్) అనే పదము ఒక వ్యక్తి స్వభావములోను లేక తత్వములోను తనకంటే గొప్పవాడని సూచించుటకు మాత్రమే ఉపయోగించబడదు. దిగువనీయబడిన వాక్యభాగములు తెలియజేయుచున్న విధముగా స్థాయిలో మరియు/లేక అధికారములో ఎవరికైనా లేక దేనికైనా ఉండే గొప్పతనమును కూడ ఈ పదము తెలియజేస్తుంది:

స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు (మెయ్‌జోన్‌) పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు (మెయ్‌జోన్‌).” మత్తయిసువార్త 11:11

స్త్రీలు కనినవారందరిలో యోహాను గొప్పవాడు అని అనగానే తక్కిన మానవులందరు యోహాను కంటె తక్కువ అనో లేక స్వభావములో యోహానుకంటే అథములనో దీని అర్థం కాదు. ఇక్కడ, యోహాను స్థానములోను హోదాలోను గొప్పవాడు అనేది ఈ పదము యొక్క ఖచ్చితమైన అర్థము.

దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు (మెయ్‌జోన్‌) కాడు, పంపబడినవాడు తన్ను పంపినవానికంటె గొప్పవాడు (మెయ్‌జోన్‌) కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” యోహానుసువార్త 13:16

యజమానుడు మరియు పంపినవాడు వారి వలెనే దాసుడు మరియు పంపబడినవాడు కూడా మనుష్యులే. ఆవిధముగా గొప్పవాడు అంటే ఇక్కడ స్థానములోను మరియు అధికారములోను గొప్పవాడు అని అర్థమే గాని, తత్వములోను మరియు స్వభావములోను గొప్పవారని మాత్రము కాదు.

నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు (మెయ్‌జోన) అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” యోహానుసువార్త 14:12

యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు ఆయన కంటే శ్రేష్ఠమైన కార్యములు జరిగించలేదు, కాని యేసు క్రీస్తు ప్రభువు భూమి మీద నున్నప్పడు కలిసినవారి కంటే ఎక్కువమందిని ఆయన శిష్యులు కలుసుకున్నారు కాబట్టి ఆయన కంటే గొప్ప సంఖ్యలో కార్యములు జరిగించారు. కావున, అదే రకమైన కార్యములనే శిష్యులు గొప్పసంఖ్యలో జరిగించారు కాబట్టి గొప్పవి అనే పదము నాణ్యతకు భిన్నముగా పరిమాణమును, కార్యముల మొత్తమును తెలియచేస్తుంది.

మెయ్జోన్ అనగా సందర్భమును బట్టి స్థానములోను, స్వభావములోను లేక రెంటిలోను గొప్పవాడు అని పైన చెప్పబడిన వాక్యభాగములు చూపెడుతున్నాయి. ఆ విధముగా, తండ్రి తనకంటే గొప్పవాడు అని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పినదానిని ఖచ్చితార్థముగా తెలుసుకోవాలంటే ఆ వాక్యభాగము  వెంటనే ఉన్న పూర్వోత్తర సందర్భమును చదవటము మాత్రమే దానికున్న మార్గము . 14వ అధ్యాయమంతటిని నిశితంగా పరిశీలిస్తే దేవుని సర్వోన్నత లక్షణాలన్నిటిని ప్రభువైన యేసు క్రీస్తు కలిగియున్నాడని తెలియబడుతుంది.

మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” యోహానుసువార్త 14:13-14

తన నామములో చేసిన లేదా తనకు చేసిన ప్రార్థనలన్నిటికి ఉత్తరమిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు అర్హుడైయున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు సర్వజ్ఞాని మరియు సర్వశక్తిమంతుడు అయ్యున్నప్పుడు మాత్రమే ఆయన ఈ ప్రార్థనలన్నిటిని విని వాటన్నిటికి ఉత్తర మియ్యగలడు!

నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.” యోహానుసువార్త 14:20-21

యేసు క్రీస్తు ప్రభువు శిష్యులందరి యందును ఉన్నానని చెప్పుచున్నాడు, అదే ఆయన ఒక మానవ మాత్రుడో లేక దేవదూతయో అయి ఉంటే వారు చేయసాధ్యము కాని వాఙ్మూలము ఇది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాబట్టి, దేవుడు సర్వవ్యామి కాబట్టి, ఒకే సమయములో విశ్వాసులందరిలో నివసించుటకు యేసు క్రీస్తు ప్రభువు సమర్దుడు అని ఆయన చెప్పటం సరియైన అర్థాన్ని ఇస్తుంది.

చివరిగా:

యేసు – ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటగైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.” యోహానుసువార్త 14:23

నిజ విశ్వాసులందరితోను తండ్రి మరియు కుమారుడు ఇద్దరు నివాసము చేస్తారు! తండ్రి ప్రతి విశ్వాసితోనూ ఉంటున్న రీతిగానే ఆయనకూడా ఉంటున్నానని చెప్పుచున్నాడు గనుక, తండ్రితో తనకున్న సమానత్వమును యేసుక్రీస్తు ప్రభువు తేటగా చెప్పుచున్నాడు!

వాస్తవానికి, యేసుక్రీస్తు ప్రభువు తన్నుతాను తండ్రితో సమానునిగా చేసుకుంటూ మాట్లాడుచున్నాడని అక్కడుండి వినిన వారికి కూడాతెలుసు:

ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు – నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక,  దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా (ఇసాన్‌) చేసికొనెను గనుక ఇందునిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసిరి.” యోహానుసువార్త 5:16-18

విశ్రాంతి దినమున తండ్రి పని చేసిన విధముగానే, తన కుమారునిగా తనకును విశ్రాంతి దినమున పని చేసే దైవికమైన హక్కు ఉన్నదని యేసు క్రీస్తు ప్రభువు చెప్పాడు కాబట్టి, దేవునితో సమానత్వము కలిగియున్నాడని యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్లు యూదులు తలంచారు. సబ్బాతు దినాచారములకు ఆజ్ఞలకు దేవుడు ఆధీనుడైయుండని రీతిగానే, యేసు క్రీస్తు ప్రభువు కూడా వాటి ఆధీనుడు కాదు కాబట్టి ఆ పరిశుద్ధ దినము రోజున చేయకూడని వాటిని దేవుని కుమారునిగా ఆయన చేసియున్నాడు.

తండ్రితో తనను తాను సమానునిగా చేసికొన్న మరొక ఉదాహరణ క్రింది వాక్యభాగములో మనము చూడగలము:

నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా  యేసు – తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు – నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.” యోహాను సువార్త 10:27-33

దైవత్వమునకు మాత్రమే ఉండే అత్యంత ప్రత్యేకమైన లక్షణములను ప్రభువైన యేసు క్రీస్తు తనకు ఆరోపించుకుంటున్నారు:

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు” ద్వితీయోపదేశకాండము 32:39

ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?” యెషయా గ్రంథము 43:13

ఈ మాటల సారమును పూర్తిగా గ్రహించుటకు, యేసు క్రీస్తు చెప్పిన మాటలను సరిగా గమినించండి; దేవునివలె సర్వశక్తిగలిగినవారెవరూ  లేరు గనుక తన గొఱ్ఱెలను రక్షించుకొనుటకు దేవుని ఉద్దేశములను అడ్డగించగలిగినవారెవరూ లేరు, మరియు తన మందను కాపాడకుండా దేవుని అడ్డగించు వారు ఎవ్వరూ లేరు అని ఆయన చెప్పుచున్నాడు. అదేవిధముగా, తండ్రి చేతిలోనుండి విశ్వాసులను ఎవరూ అపహరింపలేరు అని చెప్పుచునే “ఎవడును నా చేతిలోనుండి వాటిని అపహరింపడు” అని చెప్పుచున్నాడు; బ్రదికించువాడను నేనే అని తండ్రి చెప్పిన రీతిగానే నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను అని తెలుపుచు, ఎవరికి సాధ్యము కాని విధముగా తన తండ్రితో తాను సమానమైనవాడనని, సామర్థ్యములో అధికారములోను సమానత్వముగలవాడనని  ప్రభువైన యేసు క్రీస్తు  తెలుపుచున్నాడు; గనుక తనను తాను విశిష్టమైన స్థానములోను మరియు వర్గములోను పెట్టుకుంటున్నాడు!

యేసు క్రీస్తు ప్రభువు దేవదూషణ చేయుచున్నాడని యూదులు తలంచటములో ఆశ్చర్యము ఏమీ లేదు. యెహోవా మాత్రమే చేయగలిగిన కార్యములను తాను చేస్తానని చెప్పుకొనుచు తండ్రియంతటి బలము గలవాడను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పుకొనుటను వారు స్పష్టముగా గ్రహించగలిగారు!

ఇప్పటివరకు చెప్పుకున్నవాక్య భాగముల వెలుగులో, తన తండ్రి తనకంటే గొప్పవాడని యేసు క్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు దాని అర్థము ఏమిటో చాలా సుస్పష్ఠముగా తెలుసుకున్నాము.  యేసు క్రీస్తు ప్రభువు మానవునిగా జన్మించినప్పడు ఆయన దాసుని/పరిచారకుని యొక్క స్థానములో  మరియు రూపములోను వచ్చాడని లేఖనములు బోధిస్తున్నాయి:

గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా? యినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను” లూకాసువార్త 22:27

తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు –  ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు – నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు – నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు – నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు – ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి – స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక – మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి – నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.” యోహానుసువార్త 13:3-15

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.” ఫిలిప్పీయులకు 2:5-8

ఆవిధముగా, యేసు క్రీస్తు ప్రభువు  విధేయత కలిగిన దాసుని రూపములోను మరియు స్థానములోను ఉండి శ్రమలను, అవమానములను, గాయములను, అవమానకరమైన సిలువను సహించుచూ భూమి మీద ఉన్నంత కాలము, స్థానములోను గౌరవములోను తండ్రి తనకంటే గొప్పవానిగానే ఉంటాడు. తండ్రి ప్రక్కన కూర్చుండటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి పరలోకమునకు ఆరోహణుడైతే, ఆ అవమానకరమైన స్థితిలో ఆయన ఇకనెన్నడు ఉండరు. మానవునిగా భూమిమీదకు రాకముందు తండ్రితో ఆయనకున్న అదే దైవ మహిమ మరియు సార్వభౌమాధికారములో మరియొక సారి పాలు పొందుకుంటాడు:

తండ్రి, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము… తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.” యోహానుసువార్త 17:5,24

ఆ విధముగా, స్థానములోను హోదా లోను తండ్రి గొప్పవాడె కాని, తత్వములోను స్వభావములోను గొప్పవాడు కాదు. కాబట్టి ఆక్షేపకుడు ఇక్కడ ‘వర్గీకరణ హేత్వాభాసము (తప్పిదము)’ చేస్తున్నాడు. అనగా ఒకరు ఒకదానిలో  అనగా స్థానములో మరియు అధికారములో గొప్పవాడు అయితే అతను తప్పకుండా అన్నింటిలో అనగా తత్వములోను మరియు స్వభావములోనుకూడా గొప్పవాడు అయిఉంటాడు అని తప్పుగా ఊహించుకొంటూ, స్థానము మరియు హోదా అనే వర్గమును తత్వము మరియు స్వభావము అనే వర్గముతో అతడు/ఆమె తారుమారు చేస్తున్నాడు. ఇంతటి స్పష్టమైన బైబిలు సత్యపు వెలుగులో అది  ఎంతమాత్రము సమస్య కానే కాదు.

 

(ఆంగ్లమూలంJesus says that the Father is greater than he is, proving that he is not God, by Sam Shamoun)

Leave a Reply